CPGET 2025 Exam Dates : తెలంగాణలోని యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన టీఎస్ సీపీగెట్ 2025 నోటిఫికేషన్ విడుదలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Telangana CPGET Notification 2025 : తెలంగాణ రాష్ట్రంలోని 7 సంప్రదాయ యూనివర్సిటీలతో పాటు జేఎన్‌టీయూహెచ్ (JNTU Hyderabad)లోని పీజీ కోర్సుల్లో సీట్ల భర్తీకి నిర్వహించనున్న ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష (సీపీగెట్) 2025 నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మధ్యాహ్నం 3.30 గంటలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ విడుదల సందర్భంగా.. దరఖాస్తు తేదీలు, పరీక్ష తేదీలు, కౌన్సెలింగ్ ప్రక్రియ తదితర అంశాలకు సంబంధించి స్పష్టత ఇచ్చారు. అభ్యర్థులు పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పీజీ కాలేజీల్లో ఎంఏ, ఎంఎస్సీ, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎంకామ్ వంటి పలు కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) ఆధ్వర్యంలో ఈ టీఎస్ సీపీజీఈటీ నోటిఫికేషన్ విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మాగాంధీ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, మహిళా యూనివర్సిటీ, జేఎన్‌టీయూ హైదరాబాద్ పరిధిలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సీపీగెట్ 2025 ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు.
జులై 17 వరకు దరఖాస్తులకు అవకాశం :
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూన్ 18వ తేదీ నుంచి జులై 17వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక టీజీ సీపీగెట్ 2025 పరీక్షను ఆగస్టు మొదటి వారంలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT)లో నిర్వహించనున్నారు. ఈసారి పీజీ కోర్సులు, 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ, పీజీ డిప్లొమా వంటి కోర్సుల్లో సీట్లను ఈ సీపీగెట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా ప్రవేశాలు కల్పించననున్నారు. అయితే ఈ ఏడాది మరో 4,000 వరకు కొత్తగా సీట్లు పెరుగనున్నాయి. అలాగే.. ఈసారి 15 శాతం స్థానికేతర కోటా కింద ఏపీ విద్యార్థులకు అవకాశం ఉండదనే విషయం తెలిసిందే. నేషనల్ ఇంటిగ్రేషన్ కోటా (NIQ) కింద 20 శాతం ఈ పీజీ కోర్సుల్లో ఇతర రాష్ట్రాల విద్యార్థులు సీట్లు పొందొచ్చు.
విద్యార్హతలు:
పీజీ కోర్సులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులు డిగ్రీ కోర్సులో కనీసం 40 శాతం మార్కులు సాధించి ఉండాలి. బీఎడ్ లేదా బీపీఎడ్ కోర్సులకు డిగ్రీలో 55 శాతం మార్కులు.. ఇంటిగ్రేటెడ్ కోర్సులకు 10+2 లేదా ఇంటర్మీడియట్‌లో 50 శాతం మార్కులు వచ్చి ఉండాలి. ప్రవేశ పరీక్ష, రిజర్వేషన్ రూల్ ఆధారంగా ఆయా కోర్సుల్లో సీట్లు కేటాయిస్తారు. ఇక దరఖాస్తు ఫీజుగా ఒక సబ్జెక్టుకు ఓసీ, బీసీ విద్యార్థులు రూ.800, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ విద్యార్థులు రూ.600 చెల్లించాలి. అదనపు సబ్జెక్టులకు అన్నీ కేటగిరీల అభ్యర్థులు రూ.450 చెల్లించాలి.
